వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. వారు చెప్పినట్లుగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు గట్రావారికి షడ్రషోపేతమైన విందు భోజనం..తదితర ఏర్పాట్లు చేసి ఉండవచ్చేమో. కానీ, ప్లీనరీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులను మాత్రం అధికార పార్టీ నేతలు మరిచారు. ఆఖరికి భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేక బురద నీటిలో పోలీసులు చేతులు కడుక్కున్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్లీనరీకి వచ్చే వాహనాలను నియంత్రించే ట్రాఫిక్ పోలీసులు మొదలు…ప్లీనరీ వేదిక దగ్గర పహారా కాసే సివిల్ పోలీసుల వరకు ఖాకీలదే కీలక పాత్ర. అటువంటి ఖాకీలకే కన్నీళ్లు తెప్పించేలా వారిని ట్రీట్ చేశారు వైసీపీ నేతలు. మామూలుగా అయితే ఇటువంటి భారీ జనసందోహం ఉండే కార్యక్రమాల్లో పోలీసులు, అతిథుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ మొబైల్ టాయిలెట్స్, వాష్ రూమ్స్, షింక్స్ ఏర్పాటు చేసి డ్రైనేజీ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంటారు.
కానీ, వైసీపీ ప్లీనరీలో అటువంటి ఏర్పాట్లు ఉన్నట్లు లేవని తెలుస్తోంది. ఊరు గొప్ప పేరు దిబ్బ అన్న చందంగా ప్లీనరీలో ఏర్పాట్లున్నాయని టాక్. ఆఖరికి అష్టకష్టాలు పడి డ్యూటీ చేస్తున్న పోలీసులు ప్రశాంతంగ పట్టెడన్నం తినే పరిస్థితి లేదన్న విమర్శలు వస్తున్నాయి. చివరకు ప్లీనరీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు సైతం ఆ బురద నీటితోనే చేతులు కడుక్కుంటున్న వైనం చూస్తే మనసు కలత చెందక మానదు.
అంత అధ్వాన్న పరిస్థితుల్లోనూ…చూసే వారికి కన్నీళ్లు వస్తున్నప్పటికీ ఖాకీలు మాత్రం తమ విధులు నిర్వర్తించారు. తమ ఆవేదనను, బాధను, కన్నీళ్లను దిగమింగుకొని డ్యూటీ చేశారు. ఏది ఏమైనా ఖాకీలకే కన్నీళ్లు తెప్పించిన జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్లీనరీ సాక్షిగా ఖాకీలతో కన్నీళ్లు పెట్టించిన జగన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్లీనరీలో ఖాకీల బాధ…పగోడికి కూడా వద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.