టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసీపీ నేతలు ఎలాగైనా పాదయాత్రను అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ పాదయాత్రకు అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీకాళహస్తిలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బైరాజు కండ్రిగ వీధి నుంచి మొదలైన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. టిడిపి నేతలు ఇచ్చిన రూట్ మ్యాప్ కు పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని చతుర్మాడ వీధుల్లోకి పాదయాత్రకు ప్రవేశం లేదని పోలీసులు అడ్డుకున్నారు. అయితే, ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను చాలా రోజుల క్రితమే ఇచ్చామని, ఇప్పుడు దానికి అభ్యంతరం తెలపడం ఏమిటని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టిడిపి నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో శ్రీకాళహస్తిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్న లోకేష్ అటుగా తన పాదయాత్రను కొనసాగించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అంతకుముందు, సత్యవేడు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పోలీసులు తొలగించడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నో పాదయాత్రలు జరిగాయని, కానీ, లోకేష్ పాదయాత్రపై విధించినన్ని ఆంక్షలు మరే పాదయాత్రపై విధించలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. జీవో నెంబర్ 1 పేరుతో పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజామద్దతుతో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నానని తిరుమలలో పర్యటించిన సోమిరెడ్డి అన్నారు.