అమరావతి రైతుల పాదయాత్రకు మరెవరూ అడ్డు తగలకూడదని, అలా తగలకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ పోలీసులదేనని హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలిచ్చి గంటలు కూడా గడవక ముందే రైతుల పాదయాత్రనకు నిరసన తెలుపుతూ బంద్ పాటించాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.
రైతుల ముసుగులో టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారని, విశాఖకు పాదయాత్ర చేరుకున్నపుడు నిరసన తెలపాలని బొత్స పిలుపునివ్వడం దుమారం రేపుతోంది. రైతుల పాదయాత్ర ఏ ప్రాంతంలో కొనసాగుతుంటే ఆ ప్రాంతాల్లో బంద్ పాటించాలని బొత్స కోరడంతో కోర్టులంటే వైసీపీ నేతలకు ఏ మాత్రం గౌరవం లేదని మరోసారి నిరూపితమైందన్న విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తును చంద్రబాబు చీకట్లోకి నెట్టే యత్నం చేస్తున్నాని, అది అబద్ధమని చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ నిరూపిస్తే తాను మంత్రి పదవికి అనర్హుడినని ఒప్పుకుంటానని షాకింగ్ కామెంట్లు చేశారు.
మరోవైపు, యాత్రకు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన కొద్ది సేపటికే..స్వయంగా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడం సంచలనం రేపుతోంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో రైతులను పోలీసులు నిలిపివేయడం దుమారం రేపింది. ఐడీ కార్డులు చూపిస్తే గానీ యాత్రకు అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నేతలు, పోలీసులకు మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది.
హైకోర్టు అనుమతులతోనే యాత్ర చేస్తున్నామని రైతులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, ఓ దశలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఆ క్రమంలోనే రైతులపై పోలీసులు చేయి చేసుకున్నట్లుగా పలు టీవీ ఛానెళ్లు విజువల్స్ చూపించాయి. జేఏసీ నేతలను పోలీసులు ఈడ్చి పడేసినట్లుగా కనిపించింది. ఈ క్రమంలో ఓ మహిళా రైతు తలకు గాయమై అక్కడే సొమ్మసిల్లిపడిపోయారని తెలుస్తోంది. తమ భూముల కోసం పోరాడడమే నేరమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ చాలా విరామం తర్వాత యాత్ర ముందుకు కదిలింది.