వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వెళ్లిపోవాలని అవినాష్ వేసుకున్న ప్లాన్ ఆఖరి నిమిషంలో బెడిసికొట్టింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాశ్ ప్రయత్నించారు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.
మూడేళ్ల క్రితం మంగళగిరిలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో దేవినేని అవినాష్ ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఊపందుకుంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఏపీలో దేవినేని అవినాష్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే గురువారం రాత్రి దుబాయ్ చెక్కేయడానికి అవినాష్ ప్రయత్నించగా.. ఇమ్మిగ్రేషన్ టైమ్ లో ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయని తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంగళగిరి పోలీసులకు సమాచారం అందించగా.. అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకోవాలని వారు సూచించారు. ఇక ఎయిర్ పోర్ట్ పోలీసులు అనుమతించకపోవడంతో దేవినేని అవినాష్ వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అవినాష్ తో సహా పలువురు నేతలు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.