కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఏపీలో ఇంకా నైట్ కర్ఫ్యూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్ విధిస్తామని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక, ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేసేందుకు పోలీసులు అడపాదడపా లాఠీలు ఝుళిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో గుంటూరులో పోలీసులే కోవిడ్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా ఇళ్ల మధ్యలో రేవ్ పార్టీ పెట్టారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
గుంటూరులో రేవ్ పార్టీ వ్యవహారం ఏపీలో సంచలనం రేపింది. నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న ఓ బిల్డింగ్ నుంచి…అరుపులు, కేకలు, పెద్ద సౌండ్ తో పాటలు వినిపించడంతో స్థానికులు విసిగిపోయారు. ఆ బిల్డింగ్ లో రేవ్ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ పార్టీలో స్వయంగా ఓ సీఐ పాల్గొనడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. చివరకు ఆ బాగోతాన్ని వీడియో తీసి పట్టాభిపురం పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, ఎవరో కుర్రాళ్ల రేవ్ పార్టీ అని అక్కడకు వెళ్లిన పోలీసులు…తమ డిపార్ట్ మెంట్ కే చెందిన సీఐ మందేసి చిందేయడం చూసి అవాక్కయ్యారు. దీంతో, ఆ అధికారిని తప్పించి మిగతా వారిపై ఐపీసీ 294, కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు మహిళలతోపాటు 20 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. సీఐని చూసి ధైర్యంగా పార్టీకి వచ్చిన తమపై కేసులు పెట్టడం ఏమిటని వారు వాపోతున్నారు.
రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకల సందర్భంగా విజయవాడ నుంచి ఆరుగురు అమ్మాయిలను తెప్పించి మరీ రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు వేయించడం కలకలం రేపింది. ఈ పార్టీలో పాల్గొన్న సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. కొన్ని నెలల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లోనే పనిచేసిన సీఐ వెంకటేశ్వర్లు ఈ తతంగంలో ఉండడం విశేషం. అయితే, అది రేవ్ పార్టీ కాదని, జస్ట్ బర్త్డే పార్టీ విత్ ఆర్కెస్ట్రా అంటూ వెంకటేశ్వర్లు బుకాయిస్తున్నారని సమాచారం. ఇక, గతంలోనూ వెంకటేశ్వర్లుపై పలు అవినీతి ఆరోపణలున్నట్టు తెలుస్తోంది.