ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం..దానికి ప్రతిగా అల్లు అర్జున్ రియాక్ట్ కావడం అంతకన్నా సంచలనం రేపాయి. అయితే, కోర్టులో కేసు విచారణలో ఉండగా…అదే కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తొక్కిసలాట ఘటన గురించి మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కు పోలీసులు షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. కాగా, మీడియా సమావేశం నిర్వహించిన అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులకు ఏదైనా జరిగితే తాను ఎంతో బాధపడతానని, కానీ, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే చూస్తానని, కానీ, తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం బాధేసిందని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్ని పూర్తిగా అసత్యమని చెప్పారు. అయితే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట నాటి వీడియోను పోలీసులు బయటపెట్టడం సంచలనం రేపింది.