మాచర్ల నియోజకవర్గంలోని పాలువాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో ఆ కేసులో పిన్నెెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ క్రమంలోనే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. గతంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన పిన్నెల్లిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పకడ్బందీగా ప్రయత్నాలు మొదలుబెట్టారు.
మాచర్లలోని పిన్నెల్లి నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. రాష్ట్రం విడిచి పిన్నెల్లి పారిపోకుండా ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో ఎస్పీ ఆదేశాలతో కాపలా కాస్తున్నారు. ఈసారి పిన్నెల్లి అరెస్టు ఖాయమని, ఆయన తప్పించుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. మరవైపు, ఎన్డీఏ సునామీలో వైసీపీ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పిన్నెల్లిపై టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానంద రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. 20 సంవత్సరాల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పసుపు జెండాను జూలకంటి ఎగురవేశారు.