గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అడ్డంగా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రేషన్ బియ్యం మాయం కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. పేర్ని నాని మరియు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిజానిజాలను చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులను అందించి కేసు దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు కోరారు.
ఈ మేరకు నోటీసులను ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లగా.. అక్కడ ఎవ్వరూ లేరు. దాంతో నోటీసులను ఇంటి తలుపులకు అంటించారు. అయితే పోలీసులు పెట్టిన డెడ్‌లైన్ దగ్గర పడటంతో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు బయటకు వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు. పరారీలో ఉన్న మానస తేజ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
అసలు కేసు ఏంటంటే.. వైసీపీ హాయంలో మచిలీపట్నం మండలం, పొట్లపాలెంలో ప్రేర్ని నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్లను నిర్మించి సివిల్ సప్లైస్ శాఖకు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. ఇటీవల పౌర సరఫరాల శాఖ అధికారులు సదరు గోడౌన్లలో రేషన్ బియ్యం అక్రమం చేసినట్లు గుర్తించారు. దాదాపు 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు తేలడంతో కృష్ణాజిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించడంతో పేర్ని జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన పేర్ని నాని మరియు ఆయన కుమారుడు కిట్టు సైతం ఈ కేసులో ఇరుక్కున్నారు.