టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పలు సందర్భాల్లో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో పోసానిపై లోకేష్ పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక, దానికి బదులుగా తనకు ప్రాణహాని ఉందంటూ పోసాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా పోసానిపై జనసేన నాయకుల ఫిర్యాదు ప్రకారం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేశారని స్థానిక జనసేన నాయకులు రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాస్తవానికి గతంలో కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దీంతో, జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని కోర్టులో పోలీసులపైనే ఫిర్యాదు చేశారు.
దీంతో, జనసేన నాయకుల పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోసానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పోసానిపై ఐపీసీ 354, 355, 500, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.