దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ దానిని చట్టంగా మార్పించుకోలేకపోతున్నారు. దీంతో పాటు పోలీసులను పెద్ద ఎత్తున రాజకీయ బందోబస్తుకు అమరావతికి వాడటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిఘా తగ్గిపోయి అభంశుభం తెలియని అమాయక యువతులు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలే దీనికి ఉదాహరణ.
కామాంధులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం అని గవర్నమెంటు చెబుతోంది. మరి కఠినంగా వ్యవహరిస్తుంటే ఎందుకు అత్యాచారాలు పెరుగుతున్నాయంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో మరో ఘోరం జరిగింది.
విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం కుంబిడిసింగిలో ఇంటర్ విద్యార్థినిపై కల్యాణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి రావడంతో ఆరాతీసిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో కేసుపెట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జగన్ సర్కారు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.