ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో మార్చి 14న జరగబోయే ఆవిర్భావ వేడుకకు ఇప్పటం గ్రామాన్ని ఎంపిక చేసి సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరును స్థిరం చేశారు.దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా సభా ప్రాంగణానికి నామకరణం చేశామని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇక గుంటూరుకు వెళ్లే రహదారులన్నీ పవన్ అభిమానులతో నిండిపోనున్నాయి. అభిమాన సంద్రం పోటెత్తేందుకు సిద్ధం అవుతోంది.ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఆంక్షలు మొదలయ్యాయి అని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పోలీసులు అప్రమత్తం అయ్యారని జనసేన ప్రతినిధులు ఆవేదన చెందారు.
కొందరిని స్టేషన్లకు పిలిపించుకుని సంతకాలు సైతం సేకరిస్తున్న ఉదంతాలు సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని అంతా గమనించాలని పవన్ అభిమానులు కోరుతున్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాము సభ జరిపే తీరుతామని అంటున్నాయి జనసేన వర్గాలు.
పోలీస్ స్టేషన్లో గాఢనిద్రలో జనసైనికులు…. చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి మధు గుండు శివ మరియు జనసేన నాయకులు గోపి అంటూ ఇప్పటికే ఓ పోస్టు వైరల్ అవుతోంది.ఇదే విధంగా చాలామందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు.సభకు వెళ్లకుండా వారిని స్టేషన్లో ఉంచారని స్పష్టం అవుతోంది.
ఇదేవిధంగా చాలా ప్రాంతాలలో జనసేన కార్యకర్తలను ముందుస్తుగా అరెస్టులు చేస్తున్నారు.ఓ విధంగా ఈ సభను విజయవంతం చేసేందుకు ఇటువంటి ఆంక్షలు మరియు అరెస్టులే మేలు చేస్తాయని జనసేన అధికార ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే సభా ప్రాంగణం ఎంపికకే తమకు చుక్కలు చూపించారని, భద్రతా కారణాల రీత్యా అంటూ మూడు చోట్ల మార్చేలా చేశారని ఆఖరికి ఇప్పటం గ్రామస్థులు ముందుకు వచ్చి సహృదయత చాటుకున్నారని, ఇందుకు వీరికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని అంటున్నారు పవన్.
ఈ మేరకు ఆయన కూడా స్పందించి సభను దిగ్విజయం చేసేందుకే అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు అమలు అవుతున్నాయి అనేందుకు తాజాగా నమోదయిన ఘటనలే తార్కాణమని నాదెండ్ల సైతం వాపోతున్నారు.