ఈవీఎంను మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిన్నెల్లిని అడ్డుకోబోయిన టీడీపీ నేత శేషగిరిరావును పిన్నెల్లి అనుచురులు విచక్షణారహితంగా కొట్టారు. శేషగిరిరావుతోపాటు మాచర్ల నియోజకవర్గ పరిధిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేశారు.
ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ నేతలు, కార్యకర్తలను, బాధితులను పరామర్శించేందుకు ‘చలో మాచర్ల’ కార్యక్రమానికి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో, మాచర్లలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలింగ్ ముగిసినటప్పటి నుంచి మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉందని, మాచర్లలో ఎటువంటి కార్యక్రమాలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదని పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మలికా గార్గ్ అన్నారు.
ఈ క్రమంలోనే మాచర్లకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావులను, గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి హౌస్ అరెస్టులోనే ఉన్నారు.
ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి, వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న తమను అడ్డుకోవడం సరికాదని అన్నారు. కారంపూడిలో పరామర్శ పేరుతో మారణాయుధాలు, రాళ్లతో వెళ్లిన పిన్నెల్లిని పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో మాచర్ల వస్తానని ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. పోలీసులు సహకారంతోనే పిన్నెల్లి పారిపోయాడని ఆరోపించారు.