సినిమాను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో పుష్ప ప్రొడక్షన్ చేసిన ఒక ఆలోచన.. మొదటికే మోసం వచ్చేలా చేసింది. సినీ తారల మీద ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే. అలాంటిది బన్నీ లాంటి స్టయిలిస్టు స్టార్ తో కలిసి ఫోటో దిగే ఛాన్సు ఇస్తే.. అభిమానులు ఊరుకుంటారా? ఆత్రం.. ఆత్రంగా ఫీల్ కారు. అలా ఫీలైన వ్యవహారం శ్రుతిమించటమే కాదు.. రచ్చ రచ్చగా మారింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి కేసులు నమోదు చేసే వరకు వెళ్లింది.
ఇంతకూ పుష్ప ప్రొడక్షన్ చేసిన ప్లాన్ ఏమిటి? అదెలాంటి రసాభాసాగా మారిందన్న విషయంలోకి వెళితే..
అల్లు అర్జున్ అలియాస్ బన్నీ అభిమానులకు ఆయన తాజాగా నటించి.. ఈ వారం విడుదల కానున్న ‘పుష్ప’ మూవీ ప్రొడక్షన్.. ఆయన్ను కలిసే అవకాశంతో పాటు.. ఫోటో దిగేందుకు వీలుగాఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసింది.
ఇందుకు వేదికగా మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఎంపిక చేశారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు ఛాన్సు ఇస్తున్నట్లుగా బన్నీ ఫ్యాన్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో.. సోమవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ కు భారీగా అభిమానులు పోటెత్తారు.
పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్.. ఆ ప్రోగ్రాంకు వెళ్లలేదు. దీంతో.. తీవ్ర నిరాశకు గురైన ఆయన అభిమానులు ఆగ్రహంతో నినాదాలు చేయటమేకాదు.. ఒకసారి బలంగా తోసుకెళ్లటంతో ఎన్ కన్వెన్షన్ గేట్లు విరిగాయి. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. స్వల్ప లాఠీ ఛార్జి చేయక తప్పలేదు.
పోలీసులు లాఠీలకు పని చెప్పటంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రోగ్రాం నిర్వహణకు పోలీసుల నుంచి పుష్ప ప్రొడక్షన్ టీం కేవలం 500 మంది వస్తున్నట్లుగా చెప్పి అనుమతి తీసుకున్నారు. అందుకు భిన్నంగా దాదాపు రెండు వేల మంది చేరుకోవటంతో.. ప్రొడక్షన్ మేనేజర్ మీద కేసు బుక్ చేసినట్లుగా మాదాపూర్ పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం నిర్వహించిన పుష్ప మూవీ ప్రీరిలీజ్ వేడుక విషయంలోనూ.. ఆ చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ మీదా జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఈ వేడుకకు 5వేల పాసులు జారీ చేస్తామని.. తగినంత ప్రైవేటు సెక్యురిటీని నియమించుకుంటున్నట్లుగా చెప్పి అనుమతులు కోరారు. అంతేకాదు.. ప్రోగ్రాంను రాత్రి 10 గంటలలోపు ముగిస్తామని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా యూసఫ్ గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకకు 15 వేల మందికి పైగా సమీకరించారు.
పోలీసులకు చెప్పినట్లుగా తగినంత ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో పరిస్థితి అదుపు తప్పి.. చిన్నపాటి తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో.. నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఇలా రోజు వ్యవధిలో రెండు ఘటనలు.. కేసులు నమోదు కావటం పుష్ప మేకర్స్ కు షాకుల మీద షాకులుగా మారాయి.