నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఓ తెలుగు అమ్మాయి నడి రోడ్డు మీద మరో యువకుడితో కలిసి మందు కొట్టడం.. దమ్ము లాగించడమే కాక.. కొందరు పెద్దవాళ్లతో వాదనకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. ఇదేంటని ప్రశ్నించిన పెద్ద వాళ్లతో ఈ జంట తీవ్ర వాగ్వాదానికి దిగింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ అమ్మాయి, అబ్బాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పలేదు. హైదరాబాద్లోని నాగోల్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఒక యువతి, యువకుడు కారును రోడ్డు పక్కన ఆపి బీర్ తాగుతూ కనిపించారు. అమ్మాయి అయితే ఒక చేతిలో బీర్ పట్టుకుని.. ఇంకో చేతిలో సిగరెట్టుతో కనిపించింది.
వీళ్లిద్దరినీ చూసిన స్థానిక వాకర్స్ ఇదేం సంస్కృతి అంటూ తప్పుబట్టారు. కొందరు వారిని వీడియో తీయడం మొదలుపెట్టారు. ఐతే తమ పాటికి తాము కారు ఆపి బీర్ తాగితే తప్పేంటి అంటూ ఆ జంట పెద్ద వాళ్ల మీద ఎదురుదాడి చేసింది. కొందరిని బూతులు కూడా తిట్టింది. మేం కూడా వీడియో తీస్తాం అంటూ ఫోన్లు చేతిలో పట్టుకున్నారు.
ఈ వాదన చాలాసేపు సాగింది. ఐతే ఎవరైనా ఫిర్యాదు చేశారా.. లేక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసి పోలీసులే స్పందించారా అన్నది తెలియదు కానీ.. ఒక రోజు తిరిగేసరికి ఈ జంటను అరెస్ట్ చేశారు. వీరిలో అబ్బాయిని ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25)గా గుర్తించారు. అతడితో పాటు యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. యువతికి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ అమ్మాయి స్టేషన్లో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.