హెడ్డింగ్ చూసి ఇదేదో బ్రేకింగ్ న్యూస్ లాగా ఉందే అనిపించొచ్చు. కానీ ఇది పాత న్యూస్. మరీ సీరియస్ విషయం కూడా కాదు. ‘పుష్ప’ టీంను పోలీసులు పట్టుకున్న మాట వాస్తవమే కానీ.. వాళ్లేమీ తప్పు చేయలేదట. ఆ విషయం వివరించి చెప్పాక పోలీసులు నవ్వేసి ఊరుకున్నారట.
ఇదంతా కొన్ని నెలల ముందు సంగతి. ‘పుష్ప’ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా చోట్ల ఎర్రచందనం దుంగలు చూపిస్తారు. ఐతే ఒరిజినల్ ఎర్రచందనం దుంగలు తీసుకొచ్చి షూటింగ్ చేయడం సాధ్యం కాదు.
దీంతో కృత్రిమంగా ఎర్రచందనం దుంగల్ని తయారు చేయించారు ఆర్ట్ డైరెక్టర్లు మౌనిక-రామకృష్ణ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫోమ్ కలిపి వీటిని తీర్చిదిద్దారట. ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టి వీటిని వందల సంఖ్యలు తయారు చేయించినట్లు మౌనిక-రామకృష్ణ వెల్లడించారు.
‘పుష్ప’ సినిమాలో కొన్ని సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇక్కడి నుంచి కృత్రిమ ఎర్రచందనం దుంగల్ని తీసుకెళ్లారు. అక్కడ షూటింగ్ అయ్యాక వాటిని హైదరాబాద్కు తరలిస్తుంటే కేరళ పోలీసులు పట్టుకున్నారట. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని అపార్థం చేసుకున్నారట.
ఐతే తాము సినిమా షూటింగ్ కోసం వచ్చామని.. అవి ఒరిజినల్ ఎర్రచందనం దుంగలు కావని.. కృత్రిమమైనవని రుజువు చేశాక కానీ వారిని విడిచిపెట్టలేదట. ఈ విషయాన్ని మౌనిక-రామకృష్ణ ‘పుష్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వెల్లడించారు.
‘రంగస్థలం’ సహా పలు చిత్రాలక పని చేసిన తాము ‘పుష్ప’ కోసం పడ్డంత కష్టం మరే చిత్రానికీ పడలేదని.. షూటింగ్ దాదాపు రెండేళ్లు జరిగితే, ప్రి ప్రొడక్షన్ కోసం వెచ్చించిన ఏడాదితో కలిపి మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డామని, ఎక్కువగా అడవుల్లోనే ఉన్నామని.. అడవుల్లో కొత్తగా రోడ్లు వేసి మరీ చిత్రీకరణ జరిపామని.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థ కాకుండా మరే ప్రొడక్షన్ హౌస్ కూడా ఇలాంటి సినిమా తీయగలిగేది కాదని వారన్నారు.