మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అనంతరం చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ జిల్లాలలో అసంతృప్తతలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని చోట్ల నిరసన జ్వాలలు తారా స్థాయికి చేరి ఒక్కసారిగా ఆ మంటలు ఎగసి మళ్లీ చల్లారాయి. ఇందుకు సీఎంఓ చూపిన చొరవే ప్రధాన కారణం అని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నిన్నటి వేళ జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి తనకు ఆహ్వానమే అందలేదని తేల్చేశారు.ఇదే సందర్భంలో పోలవరానికి సంబంధించి తననేమీ అడగవద్దని చెప్పారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతోంది.
వాస్తవానికి మాజీ మంత్రి అనిల్ ఈ విధంగా స్పందించడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా తానేమి మాట్లాడినా కొత్త తలనొప్పులు వస్తాయని భావించి మాట్లాడి ఉండకపోవచ్చు. లేదా మంత్రి పదవి నుంచి తనను తప్పించిన తరువాత కూడా ప్రాజెక్టు విషయమై మాట్లాడి ఎందుకని అభాసుపాలుకావడం అనుకుని తప్పించుకోనూవచ్చు.
ఇవేవీ కాకపోయినా మంత్రి వర్గంలో తనను కాదని ప్రత్యర్థి ఎమ్మెల్యేని తీసుకోవడం కూడా ఆయన అక్కసు మరో కారణం కావొచ్చు. కాకాని గోవర్థన్ రెడ్డి కారణంగా అయినా ఆయన నిన్నటి వేళ అస్సలు ఈ విషయమే తనను అడగవద్దు అని చేతులు జోడించి అత్యంత వినమ్ర పూర్వకంగా వేడుకోవడం తరువాత చాలా వ్యంగ్యంగా మాట్లాడడం ఇవన్నీ మాజీ మంత్రి అనిల్ స్వభావానికి అద్దం పట్టే చర్యలు.
ఇప్పటికే పోలవరం పనులు 70 శాతం తామే పూర్తి చేశామని టీడీపీ చెబుతోంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం వరకూ నీరు ఇచ్చే పనులు సులువు అవుతాయని చాలా మంది ఆశలు పెట్టుకుంటున్నారు. అంటే ఇచ్ఛాపురం వరకూ కాలువ పనులు జరిగితే ఇక్కడి దాకా తాగునీటికి కొదవ ఉండదు అని, ఆ విధంగా శ్రీకాకుళం వాసులకు గోదావరి తల్లి వరప్రదాయిని కానుందని ఆకాంక్షలు ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా కేవలం తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వాటిపై మాత్రమే తాను మాట్లాడతానని చెప్పడం నిజంగానే నొప్పించక తానొవ్వక తప్పించుకుని తిరగడమే ఆయనలో ఉన్న లౌక్యానికి సంకేత రూపం అని టీడీపీ అంటోంది.
వాస్తవానికి పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ పరిహారంతో పాటు తాగునీటి వనరులకు సంబంధించిన పనులకు కానీ మిగతా పనులకు కానీ తాము డబ్బులు ఇవ్వమని కేంద్రం కొర్రీలు పెట్టింది. ఇవన్నీ రాష్ట్రం చేసుకోవాల్సిన పనులేనని తేల్చింది. కేవలం సాగునీటి వరకూ తాము చూస్తామని, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి జల విద్యుత్ పనులకు కూడా నిధులు ఇస్తామని ఇవన్నీ పాత అంచనా విలువలకు అనుగుణంగా ఇస్తామని అంతేకానీ పెరిగిన అంచనా వ్యయాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని తేల్చేసింది. దీంతో ఈ వివాదం కాస్త పెరిగి పెద్దదైంది.
ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి మేగా కంపెనీ ఇసుక వాడేందుకు వీల్లేదని అక్కడ ఉన్న కాంట్రాక్టు కంపెనీ అడ్డు చెప్పగా సంబంధిత సమస్యను సాల్వ్ చేసింది సర్కారు. ఆ తరువాత కూడా పనులు పెద్దగా వేగవంతం అవ్వలేదు. ముఖ్యమంత్రి మాత్రం వచ్చే ఖరీఫ్ కు నీళ్లిస్తామనే అంటున్నారు. ఈ తరుణంలో ప్రాజెక్టు పనులు ఎందాకా వచ్చాయి అని ఓ మాజీ మంత్రిని అడిగితే నో కామెంట్ అని తేల్చేయడం విడ్డూరం అని అంటోంది విపక్షం.