జీవనాడిని బ్యారేజీగా మార్చేస్తున్నారా?
ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్లకే!
భూసేకరణ ఖర్చు తగ్గించుకునే ఎత్తు
విశాఖ తాగునీటికి ప్రత్యేకంగా పైప్‌లైన
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రోజుకో నాటకమాడుతోంది.తుది అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా దాగుడుమూతలాడుతోంది.దీనికంతటికీ ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వాకమే కారణం.చేసిన పాపం ఆయన్ను ఇప్పుడు కట్టి కడుపుతోంది. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినప్పుడు..వేల కోట్లు దోచుకోవడానికే అంచనాలు పెంచారని నాటి విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయించారు. నిజం తెలిసీ పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్.. నాడు చంద్రబాబు రూపొందించిన తుది అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ కేంద్ర జలశక్తి శాఖ నియమించిన కమిటీ రూ.47,725.25 కోట్లకు దానిని కుదించింది. తర్వాత ఈ వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖను చేరింది.ప్రాజెక్టులో సాగునీటి కాంపోనెంట్‌కే నిధులస్తామని మెలికపెట్టింది.సాగునీటి అవసరాలకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని అంది.ఆ తర్వాత 2017లో కేంద్ర కేబినెట్ ఆమోదించిన రూ.20,398 కోట్ల తుది అంచనాకే కట్టుబడి ఉంటామని పేర్కొంది.దానిప్రకారమే రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది. పీపీఏ అత్యవసర భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. 2013-14 అంచనా ధరలకు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని నిలదీశారు.అది సాధ్యం కాదని కేంద్ర జలసంఘం అధికారులు కూడా స్పష్టం చేశారు.దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది.కానీ కేంద్రం నిధులివ్వదని మాత్రం అర్థమైంది. అందుకే ప్రాజెక్టు ఎత్తును కుదించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది.
సాధికారికంగా బలి..
ఆంధ్రుల జల-జీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును ‘బలి’ చేసే ప్రక్రియ సాధికారికంగానే మొదలైంది. కేంద్రం నుంచి పోరాడి నిధులు సాధించడం పక్కనపెట్టి..నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపైనే జగన్ సర్కారు దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో నీటిని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయాలన్నది తొలి ప్రతిపాదన. దీని ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లు! కానీ, 2013-14 అంచనా వ్యయానికే కట్టుబడి ఉంటామని..20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. దీంతో..పరిహారం ఖర్చును తగ్గించుకునేలా నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. అదే జరిగితే..అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి.సాగునీటి రంగంపై ఆ మధ్య సమీక్ష జరిపిన జగన్..పోలవరంలో నీటిని 41.15 మీటర్ల ఎత్తువద్ద నిల్వచేస్తే భూసేకరణకు ఎంత వ్యయం అవుతుందో పూర్తి స్థాయి సమాచారం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.నిర్వాసితులు,సహాయ పునరావాసం వంటి అంశాలనూ తెలియజేయాలన్నారు. వెరసి..ప్రాజెక్టు ఎత్తు కుదింపుపై స్పష్టమైన సంకేతాలు పంపారు. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేపట్టాలంటే భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.3500 కోట్ల అవసరమవుతాయని సహాయ పునరావాస కమిషనర్ చెప్పారు.దీనికోసం నెలకు రూ.300 కోట్లు చొప్పున విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డిని జగన్ ఆదేశించారు.ఇక నిర్మాణ పనులకు రూ.1000 కోట్లు కావాలని ప్రాజెక్టు సీఈ సుధాకర బాబు కోరారు.దీంతో మొత్తంగా రూ.5000 కోట్లు అవసరమవుతాయని,ఈ మొత్తాన్ని ప్రతి నెలా విడతల వారీగా మంజూరు చేస్తామని జగన్ తెలిపారు.పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే భూసేకరణ, పునరావాసానికి రూ.3500 కోట్లు అవసరమవుతాయి. 69,688.38 ఎకరాల భూసేకరణ అవసరం.ఇందులో 68,087.88 ఎకరాలు ఇప్పటికే సేకరించినందున..మరో 1600.50 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది.భూసేకరణతో 20,870 మంది నిర్వాసితులవుతారు.వారిలో ఇప్పటికే 3110 మందికి పరిహారం చెల్లించినందున..మరో 17,760 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం పోలవరం నుంచి పైపులైన్ వేసే విషయంపై ప్రతిపాదనలు తేవాలని సీఎం ఆదేశించారు.నిజానికి విశాఖ వరకు ప్రధాన కాలువ ఎప్పుడో పూర్తయింది.ఇప్పుడు కొత్తగా పైపులైన్ అవసరమేంటి? అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించినట్లే కదా! 41 మీటర్లకే పరిమితమైతే అది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు..సాధారణ బ్యారేజీగా మిగిలిపోతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమే కీలకం !
పోలవరం అంచనాలపై ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావతతో ఈ నెల 11న రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,పి.అనిల్‌కుమార్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు భేటీ అయ్యారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో పాల్గొంటారని సీఎంవో లీకులిచ్చింది.అయితే అలాంటి కార్యక్రమమే ఖరారు కాలేదు. కేవలం షెకావతను కలిశారు.కేంద్ర జల సంఘం సిఫారసు చేసిన అంచనా వ్యయం రూ.47725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు.అయితే కేంద్ర ఆర్థిక శాఖే నిర్ణయం తీసుకోవాలని ఆయన తేల్చేశారు.ఈ సమావేశం ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేదు.
చంద్రబాబుపై అభాండాలు వేయబోయి..
ఈ భేటీ తర్వాత మంత్రులు బుగ్గన, అనిల్ విలేకరులతో మాట్లాడారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై అవలంబించిన విధానాలపై మోదీ సర్కారుకు దురభిప్రాయం ఉందని..జగన్ పగ్గాలు చేపట్టాక కేంద్ర వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఉదారత చూపుతోందని అన్నారు.అదే నిజమైతే 20.398 కోట్లే ఇస్తానని ఎలా చెబుతుంది? చంద్రబాబు సీఎంగా ఉండగా..ఇంత మొత్తమే ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన రూపొందించిన 55 వేల కోట్ల తుది అంచనాలకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదముద్ర వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.పైగా వైసీపీ నంబర్ టూ విజయసాయిరెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆ అవకాశమే లేదని ఇదే షెకావత పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పారు.పైగా టీడీపీ వ్యయం చేసిన నిధులు రూ.8,500 కోట్లను కేంద్రం రీయింబర్స్మెంట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నుంచే జగన్ సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు..తాజాగా 2,234.288 కోట్లు విడుదల చేసింది.జగన్ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క బిల్లు కూడా రీయింబర్స్ కాలేదు.ఈ బిల్లులు ఇంకా పీపీఏ వద్దే ఉన్నాయి.ఇంకా కేంద్రానికి పంపనేలేదు.ఎందుకంటే చేసిన పనులకు, పెట్టిన బిల్లులకు పొంతన లేదు. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిన టీఏసీ..ఇంజనీరింగ్ అధికారుల బృందమే తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు అదే టీఏసీ నిర్ధారణ మేరకే రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించాలని..కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలంటూ..ప్రధాని మోదీని, అమితషా, నిర్మలా సీతారామన్, షెకావతలను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే..ఒక్క భూసేకరణకే రూ.28 వేల కోట్లు వ్యయమవుతాయని ఇప్పుడు చెబుతున్నారు.చంద్రబాబు చెప్పినప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించారు.అయితే..గతంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నందునే..ఎన్నికల ప్రచారం మోదీ నోట పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందన్న ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే సత్తా లేక ఇప్పటికే ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్..ఇప్పుడు పోలవరానికి మూతబండ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేయబోతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని జగన్ గుర్తెరగాలి.కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను అన్వేషించాలి.అంతేతప్ప తన మంత్రులతో చంద్రబాబును నాలుగు బూతులు తిట్టించి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు క్షమించరన్న సంగతి తెలుసుకోవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.