టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కి(సీవీసీ) సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం, డీజీపీలకు లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు లోకేష్.. సీవీసీకి లేఖ రాయడం.. ఆసక్తిగా మారింది.
ఈ లేఖలో ఆయన ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన లక్షలాది మంది నిర్వాసితులకు దారుణమైన అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు, దొడ్డిదారిలో వైసీపీ నేతలే నిర్వాసితుల పరిహారం బొక్కేస్తున్నారని, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల పోలవరం నిర్వాసిత గ్రామాల్లో లోకేష్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి గిరిజన నిర్వాసితుల గోడు విన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి వారి సమస్యలు అపరిష్కృతంగా ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం పొందారు.
దీంతో ఆ సమాచారం ఆధారంగా లక్షలాది మంది నిర్వాసితులలో అత్యధికులైన ఆదివాసీలను అధికారుల అండతో కొందరు వైసీపీ నేతలు దారుణంగా మోసం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ.. పత్రాలు, సాక్ష్యాలు, గణాంకాలతో సహా లేఖను సంధించారు.
తాను ఆర్టీఐ ద్వారా, అధికారుల ద్వారా పొందిన సమాచారం, క్షేత్రస్థాయిలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కి లేఖలో లోకేష్ తెలియజేశారు. ప్రతి నిర్వాసిత కుటుంబాన్నీ ఆదుకునేందుకు ఒక మెరుగైన ప్యాకేజీ ఉన్నప్పటికీ, అది వాస్తవ నిర్వాసితులకు చేరడంలేదని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ నేతలు కొందరు అధికారులతో కుమ్మక్కై నకిలీ డీఫారాలతో పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని, దీంతో అసలైన నిర్వాసితులకు పరిహారం అందక, పునరావాస కాలనీల్లో ఎటువంటి సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారని సీవీసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పటికి దాదాపు 12మంది నకిలీ డీ ఫారాలతో రూ.10లక్షల నుంచి రూ.52 లక్షల మేర పరిహారం పొంది దాదాపు రూ.3కోట్ల వరకూ కాజేశారని, దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదుచేస్తే కనీసం స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్ని కోట్ల పరిహారం మేసేశారో కేంద్ర విజిలెన్స్ కమీషన్ దర్యాప్తు చేసి తేల్చాలని లేఖలో కోరారు.
వాస్తవ నిర్వాసితుల పేర్లు, సర్వే నెంబర్లు, వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని వైసీపీ నేతలు ఎలా స్వాహా చేశారో ఆధారాలను లేఖకి జత చేశారు. పోలవరం నిర్వాసిత గ్రామమైన కె. కొత్తగూడెంతోపాటు చాలా గ్రామాలలో ఇదే రకమైన కుంభకోణం జరిగిందని, ఆదివాసీలకు అన్యాయం చేస్తోన్న నేతలు-సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని, పరిహారాన్ని రికవరీ చేయాలని కోరారు.
వైసీపీ నాయకులతో కలిసి స్థానిక వీఆర్వోలు తప్పుడు అడంగల్ రికార్డులు సృష్టించారని, వీటిని పరిశీలించకుండానే ఉన్నతాధికారులు వైసీపీ నాయకులకి పెద్దమొత్తంలో పరిహారం చెల్లించారని పేర్కొన్నారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జరుగుతన్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిహారం స్వాహా చేసిన వారి నుంచి రికవరీ చేసి నిర్వాసితులైన ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆ లేఖలో కోరారు. మరి దీనిపై సీవీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.