ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాటల యుద్ధానికి దిగి వార్తల్లో ట్రెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డిపై తాజాగా పోక్సో కేసు నమోదు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొందరు ఆకతాయిలు ఆమెను కొట్టి పారిపోయారు. బాలిక ఇంకా ఇంటికి రాకపోవడడంతో తల్లిదండ్రులు గాలింపు మొదలుపెట్టారు.
పాఠశాల నుంచి వస్తున్న మార్గం మధ్యలోనే పొదల పక్కన గాయాలతో బాలిక పడి ఉండటం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంటనే బాలికను హాస్పటల్ కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మైనర్ కావడంతో విచారణ చేయడానికి ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మెడికల్ పరీక్షలు చేయించారు. అయితే వైద్యులు, పోలీసులు, పాప తండ్రి ఏం చెప్పకుండానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు మీడియాలో, సోషల్ మీడియాలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు దుండగలు అత్యచారం చేశారంటూ ఊదరకొట్టారు.
ఇష్టమొచ్చినట్లు బాలికపై దుష్ప్రచారం చేసి నోరు జారారు. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పుడు ప్రచారాన్ని అప్పుడే జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఖండించారు. బాలికపై కేవలం దాడి మాత్రమే జరిగిందని.. అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో నిర్దారణ కాలేదని స్పష్టం చేశారు. ఇక తాజాగా సదరు బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని… ఈ ప్రచారం కారణంగా తమ కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవించిందని ఫిర్యాదు చేశారు. దీంతో చెవిరెడ్డితో పాటు మరికొందరి వైసీపీ నేతలపై జిల్లా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.