టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడేవారని, తనను పలుమార్లు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను మభ్యపెట్టి క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై తాజాగా పోక్సో చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు తాజాగా పోక్సో చట్టంలోని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం జానీ మాస్టర్ కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.