దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏడు పదుల వయసులోనూ అలుపన్నది లేకుండా ఎంత చలాకీగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఓవైపు దేశ పాలనను దిగ్విజయంగా సాగిస్తూనే.. మరోవైపు కమలం పార్టీని నడిపిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అలసటకు ఆస్కారం లేకుండా సెలవుకు తావు లేకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యపరంగా యువతరానికి ఒక ఆదర్శంగా నిలిచారు. అయితే 74 ఏళ్ల వయసులోనూ అంత యాక్టివ్ గా ఉంటున్న మోదీ ఏం తింటారు అనే డౌట్ చాలా మందికి ఉంది.
తాజాగా తాను మెచ్చిన సూపర్ ఫుడ్ ఏంటో మోదీ స్వయంగా రివీల్ చేశారు. ఏడాదిలో 300 రోజులు తాను తినే ఆహారమేంటో తెలిపారు. సోమవారం బీహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించిన నరేంద్ర మోదీ.. తన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. మఖానా సూపర్ ఫుడ్ అని మోదీ అన్నారు. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అయిన మఖానాను 365 రోజుల్లో 300 రోజులు తన ఆహారంలో భాగం అయ్యేలా చూసుకుంటానని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
దేశ వ్యాప్తంగా కూడా ఎందరో ప్రజలు మఖానాను అల్పాహారంగా తీసుకుంటున్నారని.. అందుకే దాని ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని మోదీ పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటుకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని.. ఈ బోర్డు ద్వారా ప్రొడెక్షన్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయని మోదీ తెలిపారు.