ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ప్రధాని మోదీకి ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఏపీలోని ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించడం, ఆ కూటమి ఏర్పాటుకు పవన్ చొరవ తీసుకోవడం వంటి కారణాల నేపథ్యంలో పవన్ పై మోదీ పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ ఆంధీ హై అంటూ ప్రపంచంలోని శక్తిమంతమైన నేతలలో ఒకరైన మోదీ ప్రశంసించడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్ గురించి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన పవన్ ను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. మిగతా నేతలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్న మోదీ…పవన్ ను చూసి ఆగి కరచాలనం చేశారు. ఈ క్రమంలోనే పవన్ తో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మీడియాకు పవన్ వెల్లడించారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అంటూ మోదీ తనను ప్రశ్నించారని పవన్ చెప్పారు. అయితే, అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని మోదీ తనతో అన్నారని పవన్ తెలిపారు. తాను చేయాల్సిన పని చెయ్యాలని తనతో మోదీ చెప్పారని పవన్ అన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, దక్షిణాదిన పవన్ కల్యాణ్ ను హిందుత్వ, సనాతన ధర్మ బ్రాండ్ అంబాసిడర్ గా చేసి బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సౌత్ లో పవన్ ను ట్రంప్ కార్డ్ గా వాడి ఇక్కడ పాగా వేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు సంబంధించిన పలు విషయాలపై పవన్ సందర్భానుసారంగా ట్వీట్లు చేస్తున్నారు. అందుకే, పవన్ కు మోదీ, బీజేపీ పెద్దలు అంత ప్రయారిటీ ఇస్తున్నారు.