ఈ రోజు నుంచి పెద్ద వయస్కుల వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం షురూ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండో దశ టీకా కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన వారికి.. 45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా వేయించుకునే వెసులుబాటు ఇవ్వటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధాని మోడీకి తొలి డోస్ ఇచ్చారు. తాను టీకా తీసుకున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయనీ సమాచారాన్ని తెలియజేశారు. ఇంతకీ మోడీ తీసుకున్న టీకా ఏది? అన్న విషయంలోకి వెళితే.. ఆయన కోవాగ్జిన్ టీకా వేయించుకోవటం గమనార్హం. ఇప్పటివరకు దేశంలోని పలువురు ప్రముఖులు సీరం ఇన్ స్టిట్యూట్ వారు రూపొందించిన టీకా వేసుకోగా.. అందుకు భిన్నంగా హైదరాబాద్ కు చెందిన భారత బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ప్రధాని వేసుకోవటం గమనార్హం.
టీకా వేసుకునే సమయంలో మోడీ మెడలో అసోంలో తయారు చేసిన గమ్చాను ధరించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయనీ వస్త్రాన్ని ధరించినట్లుగా చెప్పారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన ఈ వస్త్రాన్ని ధరించటం కనిపిస్తుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పొద్దున్నే ఎయిమ్స్ కు వచ్చిన మోడీ టీకా వేయించుకొని వెళ్లిపోయారు. టీకా వేసే వేళలో.. ప్రధాని వద్ద కేరళకు చెందిన మరో నర్సు ఉన్నారు.