ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట తెలుగు వారి ఆత్మీయ నటుడు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వ రరావు మాట వెలువడింది. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసం గం చేస్తారు. దీనినే `మనసులో మాట`(మన్‌కీ బాత్)గా పేర్కొంటారు. ఈ వారం ప్రధాని మోడీ ఎప్పటి లాగానే అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా.. వచ్చే జనవరిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగే పలు నూతన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
దీనిలో భాగంగా దేశంలో తొలిసారి వచ్చే ఏడాది ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంటును నిర్వ హిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలు ప్రపంచ దేశాల నుంచి అనేక మంది దర్శకులు, నిర్మాతలు, నటులు వస్తున్నారు. దీనిని ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఏపీకి చెందిన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా అక్కినేని శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రధాని ప్రస్తావించడం గమనార్హం.
అక్కినేని తన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని చాలా చక్కగా ప్రతి బింబించేవారని తెలిపారు. ఆయనను వేనేళ్ల కొనియాడారు. అనేక సినిమాల్లో భిన్నమైన పాత్రలు ధరించిన అక్కినేని.. ప్రతిపాత్రలోనూ ఒదిగిపోయారని తెలిపారు. చలన చిత్ర రంగంలో శిరగ్రానికి చేరుకున్నారని కొనియాడారు. తన కళా వారసత్వంతో చలన చిత్ర రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా అగ్రదర్శకుడు తపన్ సిన్హా, నటుడు రాజ్‌కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ గురించి కూడాప్రధాని నరేంద్ర మోడీ తన మన్‌కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. వీరి జీవితాలు యావత్ సినీ పరిశ్రమకు స్పూర్తి దాయకమని తెలిపారు.
కాగా.. గతంలో మహానటుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని కూడా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్‌లో ఆయన గురించి కూడా ప్రస్తావించారు. తెలుగు సినీ రంగంలోనే కాకుండా.. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చేసిన సేవలను ప్రశంసించారు. పేదల నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్న తీరును కూడా కొనియాడారు. సొంత పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌పై అనతి కాలంలోనే విజయం సాధించారని పేర్కొన్నారు. ఇలా.. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోడీ.. తెలుగు సినీ అగ్రనటులను ప్రస్తావిస్తుండడం గమనార్హం.