దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రముఖ న్యూస్ నెట్వర్క్ టీవీ 9 నిర్వహిస్తున్న `వాట్ ఇండియా థింక్స్ టుడే` శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ మీడియా ఛానెల్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ.. కాంక్లేవ్ లో పాల్గొనడం కానీ చాలా అరుదు. ఆయన ఆలోచనలు, మనోభావాలు ఎల్లప్పుడు జాతీయస్థాయిలో విస్తరించి ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియా ఛానెళ్లకే మోదీ చేరువుగా ఉండేవారు.
కానీ తాజాగా తొలిసారి టీవీ-9 న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్న శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ.. అనేక అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తన మనసులోని భావాలను అత్యంత స్పష్టంగా పలికించారు. పేదరికంపై గళమెత్తారు. 70 ఏళ్లలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం.. గత ఏడు, ఎనిమిది సంత్సరాల్లో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు. గత పదేళ్లలో మన వృద్ధి రేటు (జిడిపి) రెట్టింపు అయిందని.. దాని ఫలితంగా 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చామని వివరించారు.
నేడు ప్రపంచ దృష్టి భారత్‌పైన ఉందన్నారు. భారతదేశ అభిప్రాయానికి, భారత ఆవిష్కరణలకు, భారత ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ప్రాముఖ్యత ఇస్తున్నారని.. ఇది చాలా గొప్ప విషయమని మోదీ పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత మన దేశంలోనే ఉన్నారని.. ఈ యువత నైపుణ్యం సాధించడంలో, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో ముందున్నారని ప్రధాని కొనియాడారు.
అలాగే ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించిందని.. అప్పుడే భారతీయుల సంస్కారం ప్రపంచానికి తెలిసిందని మోదీ గుర్తు చేశారు. అందరితో కలిసి జీవించడమే నేటి భారతదేశం విధానమన్నారు. మన దేశం అన్ని విధాలుగా దూసుకుపోతుందన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం ఆలోచిస్తామో, అదే రేపు ప్రపంచ ఆలోచన అవుతుందని మోదీ నొక్కి చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని దేశాల మధ్య ఐకమత్యం అత్యవసరమని ఈ సందర్భంగా మోదీ సూచించారు.