ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశానికే తలమానికమైన పలు సంస్థలను బేరానికి పెడుతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జియోకు పరోక్షంగా మద్దతిచ్చి బీఎస్ఎన్ఎల్ ను బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని విపక్షాలు ఆరోపించాయి. ఆ తర్వాత ఎయిరిండియా విక్రయం…ఎల్ ఐసీలో వాటాల విక్రయం….ప్రైవేటు రైళ్లకు అనుమతులు… ఐఆర్ సీటీసీలో తన వాటాను విక్రయించడం ద్వారా రూ.4200 కోట్లు అర్జించడం వంటి చౌక బేరాలకు మోడీ తెర తీశారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విమర్శలు సద్దుమణగక ముందే మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదాయం, రద్దీ లేని కారణంగా వాటిని మూసేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని వారు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్ లో ఉన్న పలు రైల్వే స్టేషన్లు మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలోనే మోడీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న సంస్థలన్నింటినీ మోడీ మూసేస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓ పక్క కేంద్రంలో మోడీ సంస్థలను మూసేయడంలో బిజీగా ఉంటే….ఏపీ సీఎం జగన్ కూల్చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జగన్….తాజాగా ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు దగ్గర షాపుల ధ్వంసం వరకు తన తన విధ్వంస కాండ కొనసాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎం అయిన తర్వాత జగన్ ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని….కానీ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బుగ్గిపాలు చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ కూల్చివేతలకు…మోడీ మూసివేతలకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.