ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీ రావు ఈ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు. రామోజీ రావు మృతి పట్ల ప్రధాని మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్ మొదలగు వ్యాపార సంస్థలను రామోజీ రావు నెలకొల్పారు. రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశపు రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది.
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో కలిసి పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు.