పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాక్ తాజా ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ రాజకీయ ఆట ముగిసినట్లు కనిపిస్తోంది. ఇమ్రాన్ కు తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం దాదాపుగా ఆయనకు పదవీగండం తప్పేలా లేదని తాజాగా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన మిత్రపక్షం అయిన ముత్తహిదా ఖౌమీ మూవ్మెంట్- పాకిస్థాన్ తాజాగా ఇమ్రాన్ కు హ్యాండ్ ఇచ్చింది.
పాక్ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి ముత్తహిదా ఖౌమీ మూవ్ మెంట్ మద్దతిచ్చింది. దీంతో, అవిశ్వాస తీర్మానంపై కీలక ఓటింగ్‌కు ముందు పార్లమెంట్ దిగువ సభలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మెజారిటీ కోల్పోయింది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మొదటి వారంలో ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. అయితే, ఓటింగ్ జరగడానికి ముందే దాదాపుగా అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఓడిపోయేందుకు దోహదపడేలా మిత్రపక్షం హ్యాండిచ్చింది. 342 మంది సభ్యులు ఉన్న నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ను తొలగించాలంటే విపక్షాలకు 172 మంది మద్దతు కావాల్సి ఉండగా… పాక్ విపక్షానికి 176 మంది సభ్యుల మద్దతుంది.
ఇక, మిత్రపక్షం మద్దతు ఉపసంహరించుకోవడంతో పీటీఐకి ప్రస్తుతం 155 మంది సభ్యులు మిగిలారు. అయితే, వారిలో 24 మందికిపైగా సభ్యులు ఇమ్రాన్‌పై తిరుగుబావుటా ఎగరేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఈనెల 8న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వంద మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో ఇమ్రాన్ కు పదవీ గండం మొదలైంది. దీంతో, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది.