పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ లోనే కాదు రాజకీయాల్లోనూ నిజంగా గొప్ప ఆటగాడని నిరూపించారు. చివరి బంతి వరకు పోరాడతానని చెప్పిన ఈ ఆల్ టైం గ్రేట్ ఆల్ రౌండర్ నిజంగానే తన అవిశ్వాస తీర్మానం చివరి ఓవర్ లో అద్భుతం చేశారు. ముందుగా చెప్పినట్లుగానే విపక్షాలపై అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెయిడిన్ ఓవర్ వేశారు. ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనుమతించకపోవడంతో తన ప్రత్యర్థులపై మ్యాచ్ ను ఇమ్రాన్ ఖాన్ తాత్కాలికంగా నెగ్గారు.
ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి మాత్రం దానిని తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకోకపోవడంతో అది ఓటింగ్ పెట్టకుండానే తిరస్కరణకు గురైంది. ఈ పరిణామంతో అవిశ్వాస తీర్మానం జరిగే వరకు ఇమ్రాన్ ఖానే మళ్లీ ప్రధానిగా కొనసాగనున్నారు.
కానీ, డిప్యూటీ స్పీకర్ తీరుపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి అవిశ్వాసానికి పట్టుబట్టాయి. వాస్తవానికి స్పీకర్ అసద్ ఖైజర్ పై కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్…స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ తన అమ్ములపొదిలోని అస్త్రాన్ని తీశారు. వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. దీంతో, ఇమ్రాన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.
తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలను రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి లేఖ రాశానని, ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరగబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ప్రజలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. తనపై అవిశ్వాసం పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విదేశీ కుట్ర అని అన్నారు. అసెంబ్లీలను రద్దు చేసిన తర్వాత తదుపరి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, అపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు మొదలవుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.