తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార బీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ గెలిచిందని పలువురు అభిప్రాయపడగా..కాంగ్రెస్ పార్టీని చూసి జనం ఓటేశారని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని, బీఆర్ఎస్ ఓడిందని అన్నారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతే వారిని ఓడించిందని పీకే చెప్పారు.
మధ్య ప్రదేశ్ మినహా తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలో ప్రభుత్వ వ్యతిరేకత ఇతర పార్టీల గెలుపునకు కారణమైందని పీకే అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు భావించారని, అందుకే కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ ను చూసి ఎవరూ ఓటు వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయాలకు కారణం ఆ పార్టీ హిందుత్వ విధానాలే కారణమన్నారు.