పాల్వాయి గేటు లోని పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా పిన్నెల్లి వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం కాగా… తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పాల్వాయి గేటు లోని పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లిని అడ్డుకోబోయిన టిడిపి నేత శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లకూడదని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శేషగిరిరావు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు…హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేసింది. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ నెల 6వ తేదీన పిన్నెల్లి కేసును విచారణ జరిపి సత్వరమే పరిష్కారం, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, పిన్నెల్లి అరెస్టుపై హైకోర్టు కల్పించిన వెసులుబాటును రద్దు చేయాలని శేషగిరిరావు తన పిటిషన్ లో పేర్కొనగా సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది. తనపై హత్యాయత్నం చేశారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో శేషగిరిరావు పేర్కొన్నారు. ఏదేమైనా కౌంటింగ్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈవీఎం ధ్వంసం కేసుతోపాటు మరో మూడు కేసులలో పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే.