వైసీపీ సీనియర్ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి తాజాగా నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. శుక్రవారం హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం జైలు అధికారులు పిన్నెల్లిని ఫార్మాలిటీస్ పూర్తి చేసి విడుదల చేశారు. అయితే.. నేరుగా పిన్నెల్లి తన సొంత నియోజకవర్గం మాచర్లకు వెళ్లారు. అయితే.. ఆయనకు హైకోర్టు నుంచి ఎలాంటి నిర్బంధాలు ఈ విషయంలో లేకపోవడంతో పోలీసులు అడ్డు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
గత మేలో జరిగిన ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన కేసులో అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పుడు అదే కేసులో బెయిల్ లభించినా.. హైకోర్టు నుంచి ఎలాంటి నిషేధం లేదు. కేవలం షరతులు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. సో.. దీంతో సొంత నియోజకవర్గంలో పన్నెల్లి అడుగు పెట్టనున్నారు. దీనిపై సమాచారం అందగానే పల్నాడు జిల్లా ఎస్పీ అలెర్ట్ అయ్యారు.
మాచర్ల నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. పికెట్లు ఏర్పాటు చేశారు. దీనికి కారణం ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి ఎన్నికలసమయంలో కంటే కూడా ఎక్కువ ఉద్రిక్తంగా మారింది. వైసీపీ తరఫున గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు(మాచర్ల మునిసిపాలిటీ) శుక్రవారం గుండుగుత్తగా .. టీడీపీలోకి చేరిపోయారు. వీరిలో పిన్నెల్లి అనుచరులు, ఆయన స్వయంగా అవకాశం ఇచ్చిన వారు కూడా ఉన్నారు. దీంతో పిన్నెల్లి రగిలిపోతున్నారు. తన నియోజకవర్గంలో తన హవాకు చెక్ పడుతుండడాన్ని సహించలేక పోతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన అదే రోజు బెయిల్ రావడం.. ఆవెంటనే మాచర్లకే వెళ్తుండడంతో ఇక్కడ ఏమైనా జరగొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలావుంటే, పార్టీ అధినేత జగన్‌ను కలుసుకునేందుకు పిన్నెల్లి ముభావంగా ఉన్నట్టుతెలుస్తోంది. నేరుగా ఆయన తాడేపల్లి వచ్చి.. జగన్‌ను కలుసుకుంటారనిపార్టీ నాయకులు అనుకున్నారు. కానీ, ఈ ఊసు లేకుండా నేరుగా తన నియోజకవర్గానికే వెళ్తుండడం గమనార్హం.