ముఖ్యమంత్రి కుర్చీపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరలో ముఖ్యమంత్రి కానున్నారా? ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితులన్నీ ఇవే సంకేతాలు అందిస్తున్నాయి. అవినీతి, నేరారోపణలున్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కృతనిశ్చయంతో ఉంది. 36కి పైగా క్రిమినల్ కేసులున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కేసులన్నీ ఈ ఏడాదిలోగా తేలిపోయే అవకాశం ఉంది. ఒక్క కేసులోనైనా శిక్షపడినా ముఖ్యమంత్రి కుర్చీ వదులుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన భార్య భారతికి పాలనలో శిక్షణ ఇప్పిస్తున్నారని సమాచారం. మరోవైపు సీనియర్ మంత్రులు కూడా తమ జీవితాశయంగా భావించే ముఖ్యమంత్రి కుర్చీ దక్కే చాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని విశ్వప్రయత్నాలు ఆరంభించారు. వీరిలో పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేసులో ముందున్నారు. అంగ,అర్ధ బలంతోపాటు ఢిల్లీ స్థాయి లాబీయింగ్ కూడా ఆరంభించారని సమాచారం.
ముఖ్యమంత్రి పీఠం కోసం 10 వేల కోట్లు?
ఏపీ సీఎం జగన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసులో పేర్కొన్న 43 వేల కోట్లు పరిగణనలోకి తీసుకోకుండా..ప్రచారంలో వున్న లక్షల కోట్లు కాకుండా…కేవలం ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులతో పోల్చితే జగన్‌రెడ్డి కంటే మంత్రి పెద్దిరెడ్డి వేలకోట్లకు పడగలెత్తాడని గణాంకాలు చెబుతున్నాయి. పీఎల్ఆర్ కంపెనీతోపాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్న పెద్దిరెడ్డి… తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాలను శాసించే స్థాయిలో వేల కోట్లకు పడగలెత్తారు. ఏపీలో సర్కారు మద్యందుకాణాలలో అమ్మే పనికిమాలిన బ్రాండ్లను తయారుచేసే డిస్టిలరీలలో ఎక్కువశాతం పెద్దిరెడ్డివే. జగన్ జైలుకెళితే ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకునే అవకాశం జారవిడుచుకోకూడదనే ప్లాన్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వున్నారు. దీని కోసం ఏకంగా 10 వేల కోట్లు రెడీ చేశారు.
ఢిల్లీ లాబీయింగ్‌లో పెద్దిరెడ్డి తనయుడు!
జగన్‌రెడ్డి ఆత్మలాంటి విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాడు. పార్టీలో నెంబర్ 2గా ఎదిగే క్రమంలో తాడేపల్లి అంతఃపుర రెడ్లుగా పిలవబడే సజ్జల, వైవీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డిని తొలుత ఢిల్లీ లాబీయింగ్ నుంచి తప్పించగలిగారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సాయిరెడ్డి పాత్రను నామమాత్రం చేయడంలో విజయవంతమయ్యారు. విశాఖ ప్లస్ ఉత్తరాంధ్ర వ్యవహారాలకు పరిమితం చేస్తూనే అక్కడ అడుగడుగునా చెక్ పెడుతూ దూకుడికి అడ్డుకట్ట వేశారు. దీంతో ట్విట్టర్లో జగన్‌ని పొగుడుతూ, టిడిపిని తిడుతూ ట్వీట్లేయడం బాధ్యత ఒక్కటే విజయసాయిరెడ్డి తనకు తాను తీసుకున్న బాధ్యతగా చెలామణి అవుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఢిల్లీ లాబీయింగ్‌కి అడ్డుగా నిలిచిన విజయసాయిరెడ్డిని తప్పించాలనుకున్న క్రమంలో సజ్జల పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 స్థానం కోసం సాయిరెడ్డిని బలి వేశారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు, తన తనయుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని పార్టీ తరఫున అధికారికంగా ఢిల్లీ వ్యవహారాల పర్యవేక్షణకు జగన్‌రెడ్డే నియమించడం కలిసి వచ్చింది. త్వరలో జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని తేలుతున్న దశలో, పెద్దిరెడ్డి సీఎం పదవి చేపట్టాలంటే ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తప్పనిసరి. బయట వ్యక్తులు కంటే సొంత కొడుకే ఢిల్లీ లాబీయింగ్ చూసుకునే అవకాశాన్ని జగన్‌రెడ్డి కల్పించడం పెద్దిరెడ్డికి అనుకోని వరంగా మారింది.
పెద్దిరెడ్డి చెంతకు చేరిన సీనియర్లు?
సీఎం కావడమే జీవితం లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ …మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వున్న ధనబలం, ఎమ్మెల్యేల అండ, ఢిల్లీ లాబీయింగ్ చూసి…మీ వెంటే నేను అంటూ జై కొడుతున్నారు. బొత్స ఎన్ని ప్రయత్నాలు చేసినా 20 మందికి మించి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేక, వేలకోట్లు పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొనే శక్తిలేక, మంత్రి పెద్దిరెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. జగన్‌రెడ్డిపై అసంతృప్తిగా వున్న సీనియర్లు, వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేసి, ఆయన తనయుడి కేబినెట్లో ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారు కూడా పెద్దిరెడ్డి నాయకత్వానికి మద్దతు పలికారని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి గుప్పిట్లో 82 మంది ఎమ్మెల్యేలు?
రాజధాని తరలింపు, రాజ్యాంగ సంస్థలతో విభేదాలు, పార్టీలో లుకలుకలపై కూడా శ్రద్ధ పెట్టలేనంతగా కోర్టులు, కేసులు జగన్‌రెడ్డిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి రాసిన లేఖ కూడా జగన్‌రెడ్డి జైలు జీవితానికి మరింత దగ్గర దారి చేసిందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదంతా తాను ముఖ్య మంత్రి కావడానికి కలిసొచ్చే అంశాలని, ఇటువంటి తరుణం మరి దొరికే అవకాశమే లేదని నిర్ణయించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా వ్యూహం అమలుకు దిగారు. జిల్లాల వారీగా అధికార పార్టీ అసంతృప్త నేతలతో మంతనాలు పూర్తి చేశారు. తాను సీఎం పీఠం ఎక్కేందుకు మద్దతు ఇస్తే ఇవ్వనున్న ప్యాకేజీ ఆఫర్లకు చాలా మంది ఎమ్మెల్యేలు ఓకే చేశారు. ఇప్పటివరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 82 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించారని ఆయన వర్గానికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు