రాజే తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న రీతిలో…ఏపీ సీఎం జగన్ తాను తలచుకోగానే ఎన్నికలు నిర్వహించడం పెద్ద విషయమా అని పలు మార్లు బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్దంగా ఎన్నికలు నిర్వహిస్తానన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై కారాలు మిరియాలు నూరిన జగన్…చివరకు సుప్రీం మొట్టికాయలు వేయడంతో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.
ఇంతా చేసిన జగన్…చివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించి వెళ్లండి మహాప్రభో అంటూ నిమ్మగడ్డకు విన్నపాలు సమర్పించినా…ఆయన వినలేదు. దీంతో, తమకు అనుకూలంగా ఉన్న మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఏపీ ఎస్ఈసీగా నియమించడం, చార్జ్ తీసుకున్న వెనువెంటనే సాహ్ని పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, పది రోజుల్లో ఎన్నికలు పూర్తి కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
ఈ ఎన్నికలు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని టీడీపీ అధినేత నెత్తినోరు బాదుకున్నా వినకపోవడంతో…ఆ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. చివరకు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు విజన్ ఉన్న నేత చంద్రబాబు చెప్పిందే జరిగింది. ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. అయితే, జగన్ సామరస్యపూర్వకంగా ఉన్నారు కదా…ఎన్నికలు నిర్వహిద్దాం అనుకోకుండా రాజ్యాంగబద్ధంగా, సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి వ్యవహరించిన నిమ్మగడ్డ సేఫ్ జోన్ లోకి వెళ్లారు.
తనను నియమించిన జగన్ కు వినయవిధేయతలు చూపించే క్రమంలో ఆఘమేఘాలపై ఎన్నికలు నిర్వహించిన ఎస్ఈసీ నీలం సాహ్ని చిక్కుల్లో పడ్డారు. ఎన్నికలు రద్దయితే పర్వాలేదు…కానీ, ఏకంగా ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడం ఓ రకంగా ఆమెకు అవమానకరం అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో సాహ్ని విఫలమయ్యారని కూడా హైకోర్టు విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనం రేపింది. సాహ్ని నియామకం సరైనది కాదని, సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆమె నియామకం జరిగిందని హైకోర్టులో రేగు మహేష్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం వెల్లడించింది.