ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ఆయన డ్రైవర్.. దస్తగిరి చెప్పింది వాస్తవం కాదని.. అసలు కీలక దోషి దస్తగిరే నని.. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. వివేక హత్య కేసులోఏ-4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశారు.
దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే ఎంపీ అవినాష్ రెడ్డ, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటి వరకు కూడా ఈ కేసు ముందుకు సాగడం వెనుక సదరు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంటే కీలకంగా మారింది. అయితే, దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో..‘‘దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు“ అని కోర్టుకు విన్నవించారు.
సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని, అలాంటి వ్యక్తికి అసలు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదని పేర్కొన్నారు. హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేనని పేర్కొన్నారు. దస్తగిరి విషయంలో సీబీఐ సహకరిస్తోందని, ఆయన బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని వైఎస్ భాస్కరరెడ్డి తన పిటిషన్లో వివరించారు.
దస్తగిరిపై ఉన్న ఆధారాలను దిగువ కోర్ట్ పట్టించుకోలేదని తెలిపారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్లో భాస్కర్ రెడ్డి వివరించారు. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుందా? లేదా.. అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే దస్తగిరి విషయంలో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆయనను అప్రూవర్‌గా నిర్దారించడాన్ని కూడా సమర్థించింది.