నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీని కుదిపేస్తున్నాయి. ఇక, కోటంరెడ్డి టీడీపీలో చేరబోతున్నారంటూ లీకైనట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో క్లిప్, తన ఫోన్ ట్యాప్ అవుతోందని, తనకు ప్రాణహాని ఉందని మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే కోటం రెడ్డి, ఆనంల వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వట్టిదేనని, వీళ్ల ఫోన్లు వింటూ కూర్చోవడమే ప్రభుత్వం పని అంటూ కోటంరెడ్డిపై పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.
ఇక, ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వానికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, ప్రభుత్వానికేమీ ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. పార్టీపై అభిమానం ఉన్నవారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయరని అన్నారు. ఆ కాల్ రికార్డింగ్ క్లిప్పింగ్ సంగతేంటో చూసుకోవాలని, మంత్రి పదవులు రాక, సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని నాని విమర్శించారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని, కానీ కోటంరెడ్డి బలహీన నాయకత్వాన్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నట్టుందని షాకింగ్ కామెంట్లు చేశారు.
మరోవైపు, తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు చూపించానని, దీనిపై పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని కోటం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఆరోపణలను జగన్ సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తదితరులతో జగన్ కీలక భేటీ నిర్వహించారు. కోటంరెడ్డి వ్యవహారంపై రాష్ట్ర హోం శాఖ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ నుంచి కోటం రెడ్డిని సస్పెండ్ చేసే యోచనలో కూడా జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.