‘జీవో ప్రకారమే రేట్లు ఉంటాయి. జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే రాజమౌళి వచ్చారు. రాజమౌళి వస్తే ఒక రేటు.. రాకుంటే మరొక రేటు ఉండదు. పెద్ద సినిమాలకే కాదు.. చిన్న సినిమాలకు కూడా ఐదు షోలకు అనుమతి ఉంది. చిన్న సినిమా లేనప్పుడు పెద్ద సినిమా ఐదు షోలు వేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్తో పాటు చిన్న సినిమా విడుదలైతే ఒక షో ఇవ్వాల్సిందే. స్వచ్ఛంద సంస్థకు మేలు కలిగే అవకాశముంటే బెనిఫిట్ షోను పరిశీలిస్తాం’
‘రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నాం. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారు. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయి. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుంది’
పై రెండు పేరాలు చదివిన వారికెవరికైనా ఆ రెండు స్టేట్ మెంట్లు ఇచ్చింది వేర్వేరు వ్యక్తులని అనిపించడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే 3 రోజుల గ్యాప్ లో పరస్పరం విరుద్ధంగా ఉండే ప్రకటనలు ఒకే వ్యక్తి…అది కూడా బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేస్తారని ఎవ్వరూ అనుకోరు. కానీ, జగన్ ప్రభుత్వంలో అనుకోనిది జరగడం….తాము అనుకున్న విషయాన్ని అనుకున్న సమయంలో మంత్రులు చెప్పడం సర్వసాధారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మూడు రోజుల క్రితం తాను ఇచ్చిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా మంత్రి పేర్ని నాని తాజాగా నేడు మరో ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజమౌళి కలవక ముందు ఓ రేటు.. కలిసిన తర్వాత మరో రేటు ఉండదంటూ పేర్నినాని చెప్పిన డైలాగ్ ఇపుడు వైరల్ అవుతోంది. ఒట్టేసి ఒకమాట…ఒట్టేయకుండా ఒకమాట చెప్పనమ్మా అంటూ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ రేంజ్ లో చెప్పిన పేర్ని నాని…ఇపుడు సడెన్ గా యూటర్న్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
మొన్నేమో ఆర్ఆర్ఆర్ టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కుదరదన్న పేర్ని నాని…ఇపుడేమో ఎంత పెంచుకోవాలో కమిటీ డిసైడ్ చేస్తుందంటూ ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు రెమ్యూనరేషన్లు కాకుండానే రూ.336 కోట్లు ఖర్చు అయినట్లు చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేశారని, కమిటీ సభ్యులు చర్చించి సీఎం దగ్గరకు ఆ ఫైల్ వెళ్లాక…బడ్జెట్ కు తగ్గట్లుగా టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తామని నాని సెలవిచ్చారు.
పవన్ కు ఒక రూల్..ప్రభాస్ కు ఇంకో రూల్…తారక్, చరణ్ లకు ఒక రూల్…ఇలా తమకు నచ్చినట్లుగా నిబంధనలు పెట్టుకోగల సామర్థ్యం ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉందని ట్రోలింగ్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కో టిక్కెట్‌కు రూ. వంద వరకూ పెంచుకునేందుకు అనుమతివ్వబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇకపై భారీ బడ్జెట్ సినిమా తీయాలనుకునేవాళ్లు…ముందుగానే జగన్, పేర్ని నానిలకు ఓ మాట చెబితే అసలు సినిమా తీయొచ్చో లేదో ఓ క్లారిటీ కూడా వస్తుందంటూ సెటైర్లు పేలుతున్నాయి.