ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కు, టాలీవుడ్ పెద్దలు, థియేటర్ల యజమానులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇక, ఈ సీన్ లోకి వివాదాస్పద దర్శకుడు వర్మ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ…ఆ తర్వాత జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ తర్వాత వ్యవహారంలో వేడి కాస్త తగ్గింది. ఇండస్ట్రీ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని, మరోసారి చర్చలు జరుదామని, ఈ లోపు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మాట్లాడొద్దని చిరు చెప్పారు.
కానీ, హఠాత్తుగా జగన్, చిరుల భేటీపై తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవితో జరిగినవి కేవలం సంప్రదింపులు మాత్రమేనని, సినిమా టికెట్లకు సంబంధించిన సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయని.. ఇంట్లో జరగవని నాని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. భోజనం చేసేటపుడు అనధికారికంగా వంద మాట్లాడుకుంటారని, అవన్నీ లెక్కలోకి రావని పేర్ని నాని తేల్చేశారు.
చిరంజీవి, జగన్ లు ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారని, వారిద్దరూ మాట్లాడుకున్న విషయాలన్నీ తమకు చెప్పలేదని అన్నారు. సీఎం జగన్ భోజనానికి పిలిచారు… చిరంజీవి వెళ్లారు..అంతే అంటూ సింపుల్ గా తేల్చేశారు. ఇక, జగన్ – చిరంజీవిల బేటీలో తాను లేనని ఎస్కేప్ అయ్యారు నాని. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. భేటీ జరిగి చాలారోజులయిందని, కానీ, నాని ఇప్పుడు ఎందుకు స్పందించారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఆ భేటీ గురించి చిరంజీవి గొప్పగా చెబితే…పేర్ని నాని తాజా కామెంట్లతో చిరు గాలి తీశారని కామెంట్లు చేస్తున్నారు. మరి, నాని వ్యాఖ్యలపై చిరు స్పందిస్తారా లేదా సైలెంట్ గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.