ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్న జగన్ సర్కార్ అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనపర్తిలోని దేవి చౌక్ సెంటర్లో చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.
అయితే, ముందుగా చంద్రబాబు పర్యటనకు, రోడ్ షోకు అనుమతినిచ్చిన పోలీసులు హఠాత్తుగా అడ్డంకులు సృష్టిస్తూ అనుమతులు లేవని చెప్పడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. వేరే ప్రైవేట్ స్థలం తీసుకొని సభ నిర్వహించుకోవాలంటూ హఠాత్తుగా టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు సూచించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవీ చౌక్ సెంటర్లోనే రోడ్ షో నిర్వహించి తీరుతామని టిడిపి నేతలు తేల్చి చెబుతున్నారు.
అల కాదని చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే సహించబోమంటు వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు సభలకు విపరీతమైన ప్రజా స్పందన వస్తోందని, అది చూసి ఓర్వలేకే పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ పెద్దలు ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు లేదంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన అనుమతి పత్రాన్ని మీడియా ప్రతినిధులకు చూపిస్తూ జగన్ సర్కార్, పోలీసుల తీరును తప్పుబట్టారు.