నిరసనలు.. ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ధర్నా చౌక్ తాజాగా హాట్ టాపిక్ గా మారింది. వడ్ల కొనుగోలు విషయం రాజకీయ అంశంగా మారి.. సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి తెలంగాణ అధికారపక్షం నిలిచిన వేళ.. కేంద్రం తీరును తప్పు పడుతూ తామే ధర్నా చేపడతామని రోడ్ల మీదకు వచ్చేస్తున్న వైనం తెలిసిందే. తాము చేసే అధికారిక ధర్నాకు అధికారులు సైతం జీ హుజూర్ అన్నట్లుగా పని చేయటం విమర్శలకు తావిస్తోంది.
దర్నా చౌక్ లో ధర్నా చేయాలంటే అనుమతి ఇవ్వటానికి పోలీసులు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించటమే కాదు.. సవాలచ్చ పరిమితుల్ని చెబుతుంటారు. అలాంటిది అధికార టీఆర్ఎస్ నేతలు ధర్నా చేసేందుకు మాత్రం.. అనుమతులు ఇవ్వటం పక్కన పెడితే.. ఏకంగా సకల సౌకర్యాల్ని కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లను చేయటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. శనివారం నుంచి 72 గంటల పాటు దీక్ష చేసేందుకు వీలుగా అనుమతి కోరిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమానికి అనుమతి లభించలేదు.
రైతు వేదన పేరుతో శనివారం ఉదయం నుంచి 72 గంటల పాటు ఆమె దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్ర చేస్తున్న ఆమె.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా పాదయాత్రను వాయిదా వేశారు. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆమె గళం విప్పేందుకు వీలుగా ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. అయితే.. షర్మిల దీక్షకు అధికారులు అనుమతులు నిరాకరించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ చేస్తున్న ధర్నాకు అనుమతులే కాదు.. భారీ ఎత్తున వసతులు.. సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తుంటే.. అందుకు భిన్నంగా తమకు కనీస అనుమతి ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.