ఇదొక అనూహ్య పరిణామం.. ఇటు మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వంపైనా.. పాలనపైనా.. పథకాలపైనా.. పరోక్షంగా నిశిత విమర్శలు చేయడం.. ఆ వెంటనే సర్కారు అటు నుంచి నరుక్కురావడం.. వెంటవెంటనే జరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు చిరు విషయంలోసానుకూలంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒకవైపు మాటల దాడి (మంత్రులు, నాయకులతో) చేయిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే, ఇప్పుడు సర్కారు కూడా.. తనదైన శైలిలో చిరుకు షాకిచ్చిందనే అంటున్నారు పరిశీలకులు.
తాజాగా చిరంజీవి నటించిన `బోళా శంకర్` సినిమా శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాను కొన్ని ధియేటర్లలో 7 ఆటలు, మరికొన్ని థియేటర్లలో 6 ఆటలకు కూడా అనుమతి ఇచ్చింది. అదేవిధంగా టికెట్ ధరలు పెంచుకునేం దుకు కూడా అనుమతి ఇచ్చింది. గురువారం దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా ఇవ్వనుందని తెలిసింది. ఇదిలావుంటే, ఇదే సినిమా విషయంపై ఏపీ ప్రభుత్వం మడత పేచీ పెట్టేసింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు కానీ, ఎక్కువ షోలు వేసుకునేందుకు కానీ.. అనుమతి ఇవ్వలేదు.
ఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమ తి తిరస్కరించింది. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యు మెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. సినిమా విడుదలకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడం.. మరోవైపు నాలుగు రోజుల కిందటే పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించడంతో బోళా శంకర్ విషయంలో.. చిరు వ్యాఖ్యల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఏపీ సర్కారు కసి తీర్చుకుంటోందా? అనే చర్చ చిరు అభిమానుల్లో పెల్లుబుకుతోంది.