తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నీ తానై వ్యవహరించి షార్ప్ షూటర్ డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా బీఆర్ ఎస్ నేతలు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు తగిన జవాబు చెప్పారని అన్నారు. కాంగ్రెస్కు విజయం చేకూర్చిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
”తెలంగాణ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. మార్పును కోరుకున్నారు. ప్రగతి, అభివృద్ధి దిశగా మార్పును ఆకాంక్షించారు” అని డీకే వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారని అడిగిన ప్రశ్నకు, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నా రని, ఆయన టీమ్ లీడర్ అని, సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. సమష్టి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాటం చేసిందని, కేసీఆర్, కేటీఆర్ల గురించి తాను వ్యాఖ్యానించబోనని అన్నారు. తెలంగాణ ప్రజలు వారికి సమాధానం ఇచ్చారని చెప్పారు.
ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఎక్కడికక్కడ నాయకులు మిఠాయిలు పంచు కుంటున్నారు. మరోవైపు పార్టీఅధిష్టానం ఫలితంగా నిశిత దృష్టి పెట్టింది. చివరి నిముషంలో ఏమైనా జరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో నాయకులను ఓ కంట కనిపెడుతూనే ఉంది. తుది ఫలితం వచ్చే వరకు.. నాయకులను అంటిపెట్టుకుని ఉండాలని నమ్మకస్తులైన నాయకులకు తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. అగ్రనాయకులు అందరూ గెలుపు గుర్రాలు ఎక్కడంతో కీలక పదవుల కోసం పోటీ కూడా ప్రారంభమైంది. ఎవరికి వారు కీలక పదవుల వేటలో ముందున్నారు. మరి ఎవరికోరిక తీరుతుందో చూడాలి.