వైసీపీకి బిగ్ షాకే తగిలేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. 2019లో విజయం దక్కించుకున్న చాలా మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఇప్పుడు గుర్తించే పరిస్థితి లేకుండా పోయిందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తు న్నారు.
అయితే.. కొందరు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి షాక్ తగులుతోంది. “నేనెవరో తెలుసా?“ అని ప్రశ్నిస్తు న్న ప్రజాప్రతినిధులను ప్రజలు ఎగాదిగా చూడడమే కాకుండా.. తెలీదని మొహం మీదే చెప్పేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నివ్వెరపోతున్నారు. తమను ప్రజలు పూర్తిగా మరిచిపోయారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో కొన్ని రోజుల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను అక్కడున్న పోలీసులు కూడా గుర్తించ లేకపోయారు. దీంతో ఆయనను లోపలికి అనుమతించలేదట. ఎట్టకేలకు అరగంట గుంజాటన తర్వాత.. ఆయన డీఎస్పీ ద్వారా.. పోన్ చేయించుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చిందని పార్టీలో చర్చ సాగుతోంది. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కూడా ప్రజల నుంచి భారీ షాక్ ఎదురైంది.
తాజాగా ఆయన ఎల్.కోట మండలం కల్లేపల్లి గ్రామానికి అప్పుడెప్పుడో 2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఆయన ఎన్నికల్లో గెలిచాక ఆ గ్రామం వైపు రాలేదు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా తాజాగా కల్లేపల్లికి వచ్చారు. అయితే చాలామంది ఆయన్ను గుర్తుపట్టలేదు. శ్రీనివాసరావు ‘నేను మీ ఎమ్మెల్యేను’ అంటూ పరిచయం చేసుకున్నారు. అయితే.. కొందరు ఆయనను గుర్తు పట్టలేదని మొహంపైనే చెప్పేయడం గమనార్హం. ఇదీ.. పరిస్థితి.