ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పర్ఫెక్ట్ అవగాహన నడుస్తోందని జనాలు ఎక్కువ మంది నమ్ముతున్నారట. కల్వకుంట్ల కవితకు ఇడీ నోటీసులు ఇవ్వడం వెనుక రెండు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని జనాలు , నేతలకు అర్ధమైందని సమాచారం. తెలంగాణా ఇంటెన్షన్స్ అనే సంస్ధ ప్రతివారం రాజకీయాలపై సర్వే చేస్తుంటుంది. మామూలుగా అయితే ప్రతివారం ఏ పార్టీకి జనాధారణ ఎంతుందనే విషయంపై సర్వే రిపోర్టులు ఇస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం కవితకు ఈడీ నోటీసులపై సర్వే చేసింది.
ఈ సర్వేలోనే రెండు పార్టీలు కలిసే నాటకాలాడుతున్న ట్లు జనాలు చర్చించుకుంటున్నట్లు బయటపడింది. కవితకు ఈడీ ఉత్తుత్తిగా నోటీసులు ఇస్తుందే కానీ అరెస్టు చేయదని 21 శాతం మంది జనాలు నమ్ముతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలని 13 శాతం మంది అనుకుంటున్నారు. కవితకు నోటీసిచ్చిన ఈడీ విచారణకు హాజరైతే అరెస్టు చేస్తే బీఆర్ఎస్ సెంటిమెంటును వాడుకుంటుందని 12 శాతం మంది అనుకుంటున్నారు. కవితను తొందరలోనే ఈడీ అరెస్టు చేస్తుందని 18 శాతం మంది అనుకుంటున్నారు.
బీఆర్ఎస్ ను బెదిరించటానికి మాత్రమే బీజేపీ ఈడీతో నోటీసులు ఇప్పిస్తోందని 28 శాతం మంది నమ్ముతున్నారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు, విచారణ అన్నది రెండుపార్టీల నాటకాలని, అంతా పొలిటికల్ స్టంటే అని మెజారిటి జనాలు బలంగా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. అసలు మొదట్లో కవితకు నోటీసులిచ్చిన ఈడీ అరెస్టు చేయకపోవటంతోనే బీజేపీకి పెద్ద మైనస్ అయిపోయింది.
స్కామ్ లో చాలామందిని అరెస్టు చేసిన ఈడీ కవితను మాత్రం వదిలిపెట్టింది. అప్పుడే జనాలందరికీ బీజేపీ-బీఆర్ఎస్ పైన అనుమానాలు మొదలైపోయాయి. దాన్ని కాంగ్రెస్ బాగా అడ్వాంటేజ్ తీసుకున్నది. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ పై నరేంద్ర మోడీ-కేసీయార్ మధ్య ఒప్పందం జరిగిందని అందుకనే ఈడీ కవితను అరెస్టు చేయటం లేదని బలంగా ప్రచారం చేసింది. దాన్ని జనాల్లో చాలామంది నమ్మారు. ఆ ప్రచారమే బీజేపీని దారుణంగా దెబ్బకొట్టేసింది. అప్పటినుండే కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అదే సమయంలో కర్నాటకలో గెలవటంతో తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అంటే ఊపు పెరిగిపోయింది. చివరకు ఏమవుతుందో చూడాలి.