మార్పు మంచిదే అని అనుకున్నా.. కొన్ని కొన్ని సందర్భాల్లో మార్పు కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోనూ జరుగుతోంది. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పక్కన పెట్టిన వైసీపీ, పొరుగున ఉన్న పెడన నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేష్‌ను తీసుకువచ్చి టికెట్ ఇచ్చింది. అయితే.. ఈ మార్పు అంత మంచిది కాదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు.
పెనమలూరులో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, గౌడ సామాజిక వర్గం ఓట్లు తక్కువ గా ఉన్నాయని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్న దరిమిలా.. యాదవ వర్గం.. గౌడ వర్గానికి మద్దతు పలకడం కష్టమేనని చెబుతున్నారు. జోగి రమేష్ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దీంతో యాదువులు ఆయనకు సహకరించడం .. ఓటేయడం.. కష్టమనే వాదన ఉంది.
ఇక, పార్థసారథి విషయాన్ని కూడా నిశితంగా గమనిస్తే.. ఆయన వివాద రహితుడు. పైగా యాదవ వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు టికెట్ లేదని చెప్పిన దరిమిలా.. ఆయన యాదవ వర్గాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించారు. తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కమ్యూనిటీకి జరిగిన అన్యాయంగా ఆయన ప్రొజెక్టు చేయడంలో సైలెంట్‌గానే సఫలీకృతలయ్యారనేది వైసీపీ నాయకులు చెబుతున్న మాట. అంటే.. తమ నాయకుడిని పక్కన పెట్టి.. అసలు నియోజకవర్గంతో సంబంధం లేదని జోగిని తమపై నెట్టారని యాదవులు చెబుతున్నారు.
పోనీ.. గౌడ సామాజిక వర్గం అంతా జోగికి అండగా ఉన్నా.. వీరికన్నా యాదవ ఓటు బ్యాంకు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. మరోవైపు.. టీడీపీ నాయకుడు.. బోడే ప్రసాద్ విషయంలో సానుభూతి పెరిగింది. స్థానిక నాయకుడుకావడం.. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీని, ప్రజలను అంటిపెట్టుకుని ఉండడంతో ఆయన వైపు మెజారిటీ సామాజిక వర్గాలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో వైసీపీ చేసిన ఈక్వేషన్ ఇక్కడ బెడిసి కొట్టే అవకాశం ఉందని వైసీపీ లోకల్ నేతలు అంచనాలు వేస్తున్నారు. అయితే.. పోటీ మాత్రం గట్టిగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.