‘పెగాసస్’ అనే స్పైవేర్ సాయంతో 20 దేశాల్లో వందలాది వీఐపీల ఫోన్ లను హ్యాక్ చేశారని, వారికి తెలీకుండానే వారిపై నిఘాపెట్టారని 2019 అక్టోబర్ లో వాట్సాప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ 20 దేశాల్లో భారత్ కూడా ఉందని, భారత్‌కు చెందిన పాత్రికేయులు, ఉద్యమకారులు, న్యాయవాదులు లాంటి చాలామంది మొబైల్ ఫోన్లపై ఈ హ్యాక్ జరిగిందని వాట్సాప్ ఆరోపించడం కలకలం రేపింది.
అయితే, భారత్ లో పెగాగస్ ఎఫెక్ట్ ఏమీలేదని నాటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దాదాపు 19 నెలల తర్వాత మరోసారి పెగాగస్ పేరు వార్తల్లోకి వచ్చింది. మోడీ కేబినెట్ లోని మంత్రుల ఫోన్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు తాజాగా పుకార్లు వస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. వారితోపాటు ఆర్ఎస్ఎస్ నేతలు, సుప్రీం కోర్టు జడ్జిలు,ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలపై గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించబోతున్నాయని, ఒక వేళ ఆ ఆరోపణలు నిజమని తనకు పక్కా సమాచారం అందితే ఫోన్లు హ్యాక్ కు గురైన వ్యక్తుల జాబితా కూడా విడుదల చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకారం ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెగాసస్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్. ఇలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ ముఖ్య ఉద్దేశం. యూజర్లకు పెగాగస్ పంపిన లింక్ క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్ ఫోన్ అతడికి తెలీకుండానే పూర్తిగా హ్యాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది.
ఫోన్ లో ఆ స్పైవేర్ ఇన్ స్టాల్ అయిన తర్వాత అది ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తిగత డేటాతో పాటు పాస్వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్‌తో పాటు లైవ్ వాయిస్ కాల్స్‌ను కూడా ట్రాక్ చేస్తుంది. ఇక, ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్లో యూజర్ అసలు ఎలాంటి లింక్‌పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చని తెలుస్తోంది. రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్…అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్‌కు ఉంటుంది.