ఏపీలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతున్నాయి. చిన్న విషయాలకు వారు స్పందిస్తున్న తీరు.. అధికారాన్ని వినియోగిస్తున్న వైనంపై విమర్శలు అంతకంతకూ ఎక్కువయ్యేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరు అదే తీరులో ఉందంటున్నారు. తాజాగా ఆయన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించారు.
మంత్రివారి పర్యటన సందర్భంగా మహిళలు ఎక్కువగా హాజరయ్యేందుకు వీలుగా.. దగ్గర్లోని పారిశ్రామిక వాడకు చెందిన యజమానులను వారి వద్ద పని చేసే మహిళా కార్మికుల్ని పంపాల్సిందిగా కోరారు. పనోళ్లను రాజకీయ కార్యక్రమాలకు పంపితే.. ఉత్పత్తి ఆగిపోతుందంటూ వారు నో చెప్పారు. దీనికి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. విద్యుత్ అధికారులను రంగంలోకి దింపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్న విషయాన్ని నోటి మాటగా చెప్పించారు. అదే పనిని చేతల్లో చేసి చూపించారు.
దీంతో.. విషయం అర్థం చేసుకున్న పారిశ్రామిక వాడకు చెందిన పరిశ్రమల యజమానులు బస్సులు పెట్టించి.. తమ వద్ద పని చేసే మహిళా కార్మికుల్ని మంత్రి ప్రోగ్రాంకు పంపించారు. మొత్తం ఐదు బస్సుల్లో మహిళా కార్మికుల్ని పంపించిన వైనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్దరించటం చూసిన తర్వాత.. ఇదెక్కడి చోద్యమన్న మాట పలువురి నోట వినిపించగా.. ఏపీలో అంతే.. అంటూ వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇలాంటి తీరు జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ మార్కులు పడేలా చేస్తుందన్న విషయాన్ని మంత్రి ఎందుకు ఆలోచించరు? అన్నది ప్రశ్నగా మారింది.