నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీని కుదిపేస్తున్నాయి. ఇక, కోటంరెడ్డి టీడీపీలో చేరబోతున్నారంటూ లీకైనట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో క్లిప్, తన ఫోన్ ట్యాప్ అవుతోందని, తనకు ప్రాణహాని ఉందని మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా రాజకీయ దుమారం రేపాయి. అయితే, ఫోన్ ట్యాపింగ్ వట్టిదేనని, వీళ్ల ఫోన్లు వింటూ కూర్చోవడమే ప్రభుత్వం పనా అంటూ కోటంరెడ్డిపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
కావాలంటే, ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, వైసీపీ ప్రభుత్వానికేమీ ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. దీంతో, తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు చూపించానని, దీనిపై పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని నానికి కోటంరెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలోకి శాసనసభ మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠలపు బాలసుబ్రహ్మణ్యం చేరారు.
వైసీపీ ప్రభుత్వంపై ఆనం, కోటంరెడ్డిల తరహాలోనే విఠలపు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తన ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉందని అనుమానం కలుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కోటంరెడ్డి ఆరోపణలపై స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు.