పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ఈరోజు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనన సంగతి తెలిసిందే. అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సాబ్జీ కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాబ్జీ హఠాన్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. సాబ్జి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు.
ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో సాబ్జి మరణ వార్త తెలియడంతో జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు, సాబ్జి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లారని అన్నారు.
శాసనమండలిలో ప్రజల తరఫున పోరాడే గొంతు మూగబోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడే వ్యక్తికి నివాళులు అర్పిస్తున్నానని లోకేష్ అన్నారు. సాబ్జి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని లోకేష్ చెప్పారు. ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొన్న షేక్ సాబ్జీ… భీమవరం వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఉండి మండలంలో ఆయన కారును మరో కారు ఢీకొన్న ఘటనలో దుర్మరణం పాలయ్యారు.