ఏపీ ఆర్ధిక శాఖలో రూ.41 వేల కోట్లకు సంబంధించిన జమా ఖర్చుల్లో అవకతవకలు జరిగాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పనితీరు దారుణంగా ఉందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పయ్యావుల లేఖ రాయడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది.
అయితే, ఈ వ్యవహారంపై ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా పయ్యావుల ఆరోపణలు చేయడం శోచనీయం అని అన్నారు. పయ్యావులకు అనుమానాలుంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చని, సందేహాలుంటే సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలపై పయ్యావుల దీటుగా స్పందించారు.
ఆ అవకతవకలపై బుగ్గన సమాధానం సరిగా లేదని పయ్యావుల తప్పుబట్టారు. తాను 7 నిమిషాలు మాట్లాడితే…దానికి వివరణ ఇచ్చేందుకు బుగ్గనకు 55 నిమిషాలు పట్టిందని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తన ఆరోపణలకు సహేతుకమైన వివరణ ఇవ్వని బుగ్గన…రాజకీయ విమర్శలకు దిగారని మండిపడ్డారు. గవర్నర్ బిశ్వభూషణ్‌కు తాను ఇచ్చిన లేఖను బుగ్గన తేలికగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఏజీ తప్పు చెప్పిందని, ఢిల్లీలో వాళ్లకు అర్థం కాలేదు అని బుగ్గన మాట్లాడడం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. గత ఏడాది జూన్ 17న తాను ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్, సీఎస్‌ని లెక్కలు అడిగితే…ఈ ఏడాది జులై1న సింగిల్ లైన్ సమాధానమిచ్చారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ రూ. 25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన సంగతి ఆ లెక్కల్లో చూపలేదని పయ్యావుల గుర్తు చేశారు.
రూ.25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని పయ్యావుల జగన్ సర్కార్ గుట్టువిప్పారు. మరి, పయ్యావుల తాజా కౌంటర్ కు బుగ్గన స్పందిస్తారా లేక సైలెంట్ అవుతారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా..పయ్యావుల రాసిన లేఖ వైసీపీ సర్కార్ ను ఇరకాటంలో పడేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.